కొల్లాపూర్‌లో పోలీసుల దాష్టికం.. పసిపిల్లల సైతం అరెస్ట్!

Published on: 16 May 2026, 11:09 AM
News Article
  • మంత్రి జూపల్లి అనుచరుడి భూకబ్జాపై దీక్ష..
  • బాధితులపై ఖాకీల కర్కశత్వం
  • అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన..
  • ప్రశ్నిస్తే అక్రమ కేసులు, బ్లాక్‌మెయిల్



హైదరాబాద్ న్యూస్ టైమ్, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డులో అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరుడైన యం.డి. ఖాదర్ పాషా పేదల భూమిని అక్రమంగా కబ్జా చేయడం, దాన్ని నిరసిస్తూ బాధితులు చేపట్టిన దీక్షపై పోలీసులు కర్కశంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాము కష్టపడి కొనుక్కున్న భూమిని కౌన్సిలర్ కబ్జా చేశారంటూ న్యాయం కోసం అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా, పోలీసులు అక్కడకు చేరుకుని పసిపిల్లలను సైతం వదలకుండా దారుణంగా అరెస్ట్ చేశారు. పిల్లలు భయంతో గుక్కపట్టి ఏడుస్తున్నా ఏమాత్రం మానవత్వం లేకుండా ఖాకీలు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కబ్జాపై తాము ప్రశ్నిస్తే మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు చెప్పుకుంటూ కౌన్సిలర్ ఖాదర్ పాషా తమను తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, పైగా పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తూ బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.