కోమటిరెడ్డికి మంత్రి పదవి రావాలని తిరుపతిలో ప్రత్యేక పూజలు!
సంస్థాన్ నారాయణపురం, (జూలై 23), హైదరాబాద్ న్యూస్ టైమ్: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని ఆకాంక్షిస్తూ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నేడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను దూకుడుగా నిర్వహిస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు తన సొంత ఖర్చులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని కొనియాడారు. అలాగే, తన తల్లి గారి పేరు మీద 'కోమటిరెడ్డి ఫౌండేషన్' ద్వారా ఎంతోమందికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ... కంటి ఆపరేషన్లు, మందులు మరియు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్న గొప్ప జననేత అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమిత్ చౌహన్, పలువురు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.