క్యాన్సర్ మరణాలకు బ్రేక్.. క్లినికల్ ట్రయల్స్‌లో సంచలన నిజాలు!
హైదరాబాద్ న్యూస్‌టైమ్, ఆరోగ్య విభాగం: బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల చికిత్సలో భారతీయ వైద్యులు ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. చిన్న పిల్లల్లో వచ్చే ఒక రకమైన రక్త క్యాన్సర్ 'అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా' (ALL) చికిత్స సమయంలో.. స్టెరాయిడ్స్ ఇచ్చే పద్ధతిలో చిన్న మార్పు చేయడం ద్వారా చికిత్స తాలూకు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని సరికొత్త అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక 'ది లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ ఈస్ట్ ఏషియా' (The Lancet Regional Health–Southeast Asia) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
చెన్నైలోని క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (WIA) సహా దేశంలోని 6 ప్రముఖ క్యాన్సర్ కేంద్రాలలో 2016 నుండి 2022 వరకు, దాదాపు 1,246 మంది చిన్నారులపై నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఆశాజనక విషయాలు వెల్లడయ్యాయి.
అసలు సమస్య ఏంటి?
భారతదేశం లాంటి తక్కువ వనరులు ఉన్న దేశాలలో, చిన్నారులకు ల్యుకేమియా కోసం కీమోథెరపీ ఇచ్చే సమయంలో క్యాన్సర్ కంటే కూడా.. ఇన్ఫెక్షన్లు, సెప్సిస్ (రక్తంలో ఇన్ఫెక్షన్) కారణంగానే ఎక్కువ మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ చికిత్స ప్రారంభ దశలో (ఇండక్షన్ ఫేస్) 'ప్రెడ్నిసోలోన్' అనే స్టెరాయిడ్‌ను నిరంతరాయంగా ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, తీవ్రమైన బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వైద్యులు చేసిన ఆ విప్లవాత్మక మార్పు ఏంటి?
ఈ మరణాలను తగ్గించడం కోసం 'ఇండియన్ చైల్డ్‌హుడ్ కొలాబరేటివ్ ల్యుకేమియా గ్రూప్' పరిశోధకులు చిన్నారులను రెండు గ్రూపులుగా విభజించి పరిశీలించారు:
- మొదటి గ్రూప్: వీరికి ఎప్పటిలాగే 4 వారాల పాటు నిరంతరాయంగా (Continuous) స్టెరాయిడ్స్ ఇచ్చారు.
- రెండో గ్రూప్ (పల్స్డ్ షెడ్యూల్): వీరికి స్టెరాయిడ్స్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మధ్యలో చిన్న బ్రేక్ (చికిత్స విరామం) ఇస్తూ రెండు విడతలుగా (Pulsed Steroid) అందించారు.
ఫలితం: తగ్గిన మరణాలు!
ఈ సరికొత్త 'పల్స్డ్ స్టెరాయిడ్' విధానం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. పాత పద్ధతిలో చికిత్స పొందిన 623 మంది పిల్లల్లో 22 మంది ఇన్ఫెక్షన్ల వల్ల చనిపోగా.. కొత్తగా బ్రేక్ ఇస్తూ స్టెరాయిడ్స్ తీసుకున్న 623 మందిలో కేవలం 8 మంది మాత్రమే మరణించారు. అంటే ఈ చిన్న మార్పు వల్ల ప్రారంభ దశలోనే ఇన్ఫెక్షన్ల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇలా స్టెరాయిడ్ మోతాదుల మధ్య విరామం ఇవ్వడం వల్ల క్యాన్సర్ తగ్గే రేటు (Remission Rates) గానీ, పిల్లలు దీర్ఘకాలం బతికే రేటు (Long-term Survival) గానీ ఎక్కడా తగ్గలేదని, క్యాన్సర్‌పై మందులు అంతే సమర్థవంతంగా పనిచేశాయని వైద్యులు స్పష్టం చేశారు.
పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి చేసిన కఠినమైన, అధిక మోతాదుల చికిత్స విధానాలను బ్లైండ్‌గా ఫాలో అవ్వకుండా.. భారతదేశం లాంటి దేశాల్లోని స్థానిక ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి మార్పులు చేసుకోవడం ఎంతో అవసరమని ఈ పరిశోధన నిరూపించింది. ఈ సరికొత్త పరిశోధన తక్కువ ఖర్చుతో కూడిన వైద్య వనరులు ఉన్న ప్రాంతాల్లో ఎంతో మంది క్యాన్సర్ చిన్నారుల ప్రాణాలను కాపాడనుందని వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.