"గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్.. మీ కాళ్లు పట్టుకుంటా!"
- ఒక్క ప్యాకెట్ కోసం సెల్ టవర్ ఎక్కి యువకుడి హైడ్రామా
- యర్రగొండపాలెంలో హల్చల్..
- చాకచక్యంగా కిందికి దించిన పోలీసులు
హైదరాబాద్ న్యూస్ టైమ్, యర్రగొండపాలెం (ప్రకాశం): గంజాయి ప్యాకెట్ ఇప్పిస్తేనే కిందకు దిగుతానంటూ ఓ యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కి వీరంగం సృష్టించిన వింత ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. తిరుమలగిరి కాలనీకి చెందిన హనుమంతు అనే యువకుడు ఆదివారం ఉదయం పూర్తి మద్యం మత్తులో స్థానికంగా ఉన్న ఒక సెల్ టవర్ పైకి ఎక్కి పీట్లు చేయడం ప్రారంభించాడు. పైనుంచి కేకలు వేస్తూ.. "నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్, మీ కాళ్లు పట్టుకుంటా" అంటూ పోలీసులను, స్థానికులను బతిమిలాడటం మొదలుపెట్టాడు. సమాచారం అందుకున్న యర్రగొండపాలెం పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని, ఆ యువకుడి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అత్యంత చాకచక్యంగా మాటల్లో దించారు. గంజాయి ఇప్పిస్తామంటూ నమ్మించి, అతనితో సున్నితంగా మాట్లాడి ఎట్టకేలకు టవర్ పైనుంచి సురక్షితంగా కిందకు దించారు. అనంతరం తీవ్ర మత్తులో ఉన్న సదరు యువకుడిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.