గంజాయి మత్తులో ప్రిన్సిపల్ దారుణ హత్య: వెలుగులోకి దిగ్భ్రాంతికర విషయాలు
కొండమల్లేపల్లి, ఆగస్ట్ 19, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు సంచలన నిజాలు వెల్లడించారు. ఆమెను హత్య చేసింది మరెవరో కాదు, స్వయంగా ఆమె పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. గంజాయికి అలవాటుపడి, విచ్చలవిడిగా జల్సాలు చేయడానికి డబ్బులు కావాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి, అంతకంటే ముందే నిందితులు గోడ దూకి ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్న నిందితులు, ఆమె ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనక నుంచి వచ్చి కత్తితో ఏకంగా 27 సార్లు పొడిచి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ. 2 లక్షల నగదును ఎత్తుకెళ్లిన విద్యార్థులు, ఆ డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, సీసీ కెమెరాల్లో చిక్కుకోకుండా నిందితులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ, పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఎట్టకేలకు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.