గండిగూడెం వద్ద ఘోరం.. భర్త కళ్లెదుటే భార్య గొంతుకోసి దారుణ హత్య!
* అడ్డుకున్న భర్తపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం
* బైక్ ఆగిపోయిన సమయంలో పొదల్లోంచి వచ్చి దుండగుల అటాక్
హైదరాబాద్ న్యూస్‌టైమ్, బొల్లారం, మే 31: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పరిధిలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు అనిల్ కుమార్, మీనా దేవి (35) బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలో వారి వాహనం ఆగిపోవడంతో.. అదే సమయంలో అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన కొందరు గుర్తుతెలియని దుండగులు మీనా దేవిని బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్త అనిల్ కుమార్‌పై దుండగులు కత్తులతో తీవ్రంగా దాడి చేయడమే కాకుండా, అతని కళ్లెదుటే మీనా దేవి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడివున్న అనిల్ కుమార్‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అనుమానాస్పద హత్య ఘటనపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టారు.