గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు సర్కారు ‘మంగళం’..

Published on: 16 May 2026, 03:26 AM
News Article
  • రాజధానిలో ఏకంగా 4,618 ఎకరాల్లో నిర్మాణానికి శ్రీకారం..
  • రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని మండిపడుతున్న విపక్షాలు
  • రూ. 4,000 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనా?..
  • హీత్రూ, శంషాబాద్ కంటే పెద్ద ఎయిర్‌పోర్ట్‌పై సర్వత్రా విమర్శలు

హైదరాబాద్ న్యూస్ టైమ్, అమరావతి: రాజధాని అమరావతికి దూరం ఉందనే సాకుతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (గన్నవరం) మూసివేసి, అమరావతి కోర్ ఏరియాలో కొత్తగా భారీ ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి, విమర్శలకు దారితీస్తోంది. నిన్నటి దాకా గన్నవరం కూడా అమరావతిలో భాగమేనని ప్రచారం చేసి, దాని విస్తరణ కోసం ఏకంగా రూ. 4,000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు విజయవాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి పక్కనే ఉండి పశ్చిమ బైపాస్ మీదుగా కేవలం 30 నిమిషాల్లో రాజధానికి చేరుకునే అవకాశం ఉన్న గన్నవరాన్ని పక్కనబెట్టడం వెనుక పెద్ద ‘రియల్ ఎస్టేట్’ స్కామ్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే లండన్ హీత్రూ విమానాశ్రయం కేవలం 1,670 ఎకరాల్లో, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ 2,000 ఎకరాల్లోనే విస్తరించి ఉండగా, అమరావతిలో కొత్త ఎయిర్‌పోర్ట్ కోసం ఏకంగా 4,618 ఎకరాల విలువైన భూములను కేటాయించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ దుబారా ఖర్చులు, భూ వ్యాపార ప్రయోజనాలే ఉన్నాయని విపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం మండిపడుతున్నారు.