గయానా తీరంలో ఘోర విషాదం: మునిగిపోయిన ప్రయాణికుల పడవ, 27 మంది మృతి
Published on: 21 Jul 2026, 02:17 AM
జార్జ్‌టౌన్, జూలై 21, 2026, హైదరాబాద్ న్యూస్ టైమ్: గయానా తీరంలో శనివారం రాత్రి 'ఎంవీ బరిమా' (MV Barima) అనే ప్యాసింజర్ ఫెర్రీ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన ముఖ్య వివరాలు:
- ప్రయాణికుల సంఖ్య: అధికారిక రిజిస్ట్రీ ప్రకారం నౌకలో 133 మంది ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నట్లు తాము నమ్ముతున్నామని ప్రధాన మంత్రి మార్క్ ఫిలిప్స్ తెలిపారు. ఇప్పటివరకు 69 మందిని రక్షించినట్లు ఆయన వెల్లడించారు.
- అమలులో గాలింపు చర్యలు: గల్లంతైన వారి కోసం డైవర్లు మునిగిపోయిన నౌక ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఫెర్రీ ప్రమాద స్థలం నుంచి చిన్న ప్రైవేట్ బోట్ల ద్వారా కనీసం 17 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పొరుగునే ఉన్న ఫ్రెంచ్ గయానా నుంచి ఫ్రెంచ్ సైన్యం అందించిన 12 మంది డైవర్లు, వైద్యులు ఈ సహాయక చర్యల్లో పాలుపొంచుకున్నారు.
- కెప్టెన్, సిబ్బంది అరెస్ట్: ఈ ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పబ్లిక్ వర్క్స్ మంత్రి జువాన్ ఎడ్జిల్, ఫెర్రీ కెప్టెన్ మరియు కనీసం ఒక సిబ్బంది సభ్యుడు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. విధుల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెప్టెన్ మరియు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- పెద్ద అలల తాకిడి: గయానా రాజధాని జార్జ్‌టౌన్ నుండి పోర్ట్ కైటుమాకు బయలుదేరిన ఈ 40 మీటర్ల పొడవైన నౌకను ఒక పెద్ద అల్ల కప్పేయడంతో ఒక్కసారిగా నీరు లోపలికి వచ్చి నిమిషాల్లోనే మునిగిపోయినట్లు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ప్రధాని మార్క్ ఫిలిప్స్ స్పష్టం చేశారు.