గూగుల్ మ్యాప్స్‌ను మించిన పావురాల టెక్నాలజీ!

Published on: 31 May 2026, 06:35 AM
News Article

* దారి తప్పకుండా గమ్యానికి చేర్చే అద్భుతమైన 'కంపాస్'

* కాలేయంలోని రోగనిరోధక కణాలే వీటికి దిక్సూచి..

* జర్మనీ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వెలుగుచూసిన ఆసక్తికర అంశాలు

హైదరాబాద్‌ న్యూస్‌టైమ్‌, సైన్స్ డెస్క్: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో.. శత్రువుల మధ్య చిక్కుకుపోయిన అమెరికా సైనికుల సమాచారాన్ని మోసుకెళ్లి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది ఒక పావురం. టెలిగ్రాఫ్ వ్యవస్థ సరిగా లేని రోజుల్లో ఐరోపా దేశాల్లో స్టాక్ మార్కెట్ వివరాలను చేరవేసినవీ ఈ పావురాలే. ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) కాలంలో ఏకంగా సీఐఏ (CIA) కోసం స్పై కెమెరాలను మోసుకెళ్లి గూఢచర్యంలోనూ ఇవి సత్తా చాటాయి. వేల కిలోమీటర్ల దూరం వెళ్లినా, దట్టమైన మబ్బులు కమ్మేసినా.. ఇవి దారి తప్పకుండా కచ్చితమైన గమ్యానికి ఎలా చేరుకుంటాయన్నది దశాబ్దాలుగా సైంటిస్టులను తొలిచేస్తున్న అతిపెద్ద మిస్టరీ. ఈ ప్రశ్నకు తాజాగా జర్మనీ శాస్త్రవేత్తలు సమాధానం కనుక్కున్నారు. పావురాల శరీరంలో దాగున్న ఒక అత్యంత అద్భుతమైన క్వాంటం సైన్స్ రహస్యాన్ని వారు ఛేదించారు.

'గట్ ఫీలింగ్'తోనే నేవిగేషన్.. సాధారణంగా పక్షులు సూర్యుడి వెలుతురు, వాసనలు, భౌగోళిక గుర్తుల ఆధారంగా ప్రయాణిస్తుంటాయి. కానీ, దట్టమైన మబ్బులు కమ్మేసి, దారి ఏమాత్రం కనిపించని ప్రతికూల పరిస్థితుల్లో పావురాలు తమ 'గట్ ఫీలింగ్' (Gut Feeling) ను వాడుకుంటాయని జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ బాన్, మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. పావురం కాలేయం (Liver)లో ఉండే రోగనిరోధక కణాల్లో ఐరన్ (ఇనుము) శాతం చాలా ఎక్కువగా ఉంటుందని, ఈ కణాలు క్వాంటం స్థాయిలో పనిచేస్తూ భూమి అయస్కాంత క్షేత్రాన్ని (Magnetic Field) పసిగట్టే కంపాస్‌లా వ్యవహరిస్తాయని వారు గుర్తించారు. దీన్నే సైన్స్ పరిభాషలో 'సూపర్‌పారామాగ్నెటిజం' (Superparamagnetism) అంటారు. ఈ కణాలు కాలేయం గుండా వెళ్లే నరాల ద్వారా మెదడుకు సిగ్నల్స్ పంపడం వల్లే.. పావురాలు ఎటు వెళ్లాలో కచ్చితంగా నిర్ణయించుకుంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోగనిరోధక వ్యవస్థ ఇలా ఒక సెన్సార్‌లా పనిచేయడం సైన్స్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది.

ఆ కణాలు లేకపోతే దారి తప్పినట్లే! ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిశోధకులు 34 పావురాలతో ఒక ఆసక్తికర ప్రయోగం చేశారు. కొన్ని పావురాల శరీరంలోని ఐరన్ కణాలను తాత్కాలికంగా తొలగించి, 12 మైళ్ల దూరం ప్రయాణించేలా గాల్లోకి వదిలారు. సూర్యుడు ఉన్నంతసేపు ఆ పావురాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యానికి చేరుకున్నాయి. కానీ, వాతావరణంలో మబ్బులు కమ్మేయగానే (Overcast conditions).. ఐరన్ కణాలు లేని పావురాలు అయస్కాంత క్షేత్రాన్ని పసిగట్టలేక దారి తప్పిపోయాయి. గమ్యం చేరలేక గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తిరిగి వాటి శరీరంలో ఐరన్ కణాలు వృద్ధి చెందాక, మళ్లీ దారిని కరెక్టుగా పట్టుకోగలిగాయని శాస్త్రవేత్తలు వివరించారు.

సైంటిస్టుల్లో భిన్నభిప్రాయాలు.. అయితే, పావురాల నేవిగేషన్ పై జర్మనీ శాస్త్రవేత్తలు వెల్లడించిన ఈ కొత్త సిద్ధాంతంతో కొందరు పరిశోధకులు ఏకీభవించడం లేదు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Caltech)కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు దీనిపై స్పందిస్తూ.. ఈ ఐరన్ కణాలు నేరుగా అయస్కాంత క్షేత్రాన్ని గుర్తిస్తాయనడానికి మరింత బలమైన, ప్రత్యక్ష ఆధారాలు కావాలని అభిప్రాయపడ్డారు. తేనెటీగలు, అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల మెదడులో కూడా ఇలాంటి కణాలు ఉంటాయని, వాటి అసలు విధి వేరే ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. రాబోయే రోజుల్లో శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పావురాల నేవిగేషన్ స్కిల్స్‌పై మరిన్ని పరిశోధనలు జరపడానికి సైంటిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ 'క్వాంటం కంపాస్‌' రహస్యం పూర్తిగా వీడితే భవిష్యత్తు టెక్నాలజీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం.