గేట్ టుగెదర్ పార్టీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

Published on: 14 Jun 2026, 09:25 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, చౌటుప్పల్, జూన్ 14, 2026: ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడపడానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫామ్‌హౌస్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వీకెండ్ కావడంతో కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొయ్యలగూడెం శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో గేట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన వారిలో మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము (27) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాము మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న మిగతా టెక్కీలను పోలీసులు అదుపులోకి తీసుకుని, అసలు అక్కడ ఏం జరిగిందనే కోణంలో తీవ్రంగా విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.