గ్రీన్ ఎనర్జీపై 'కనెక్టివిటీ' బాదుడు: సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులపై ఏపీ ట్రాన్స్‌కో అదనపు భారం!
హైదరాబాద్ న్యూస్‌టైమ్, అమరావతి, జూన్ 15, 2026: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగానికి ఊతమివ్వాలనే లక్ష్యానికి భిన్నంగా పెట్టుబడిదారులపై అదనపు ఆర్థిక భారం మోపేందుకు ఏపీ ట్రాన్స్‌కో సిద్ధమైంది. రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం కావాలనుకునే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమలు, భారీ విద్యుత్ వినియోగదారులపై సాంకేతికత పేరుతో పెద్ద ఎత్తున చార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రిడ్‌లోకి విద్యుత్‌ను పంపినా లేదా అక్కడి నుండి తీసుకున్నా అదనపు వసూళ్లు చేసేలా ‘కనెక్టివిటీ ఒప్పందం’ పేరుతో రూపొందించిన ముసాయిదా నిబంధనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) అనుమతి కోసం పంపడం ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ముసాయిదాలోని కఠిన నిబంధనలు - చార్జీల బాదుడు:
- వీలింగ్, ట్రాన్స్‌మిషన్ చార్జీల భారం: ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ విక్రయాలు లేదా వినియోగం చేపట్టే సంస్థలు తప్పనిసరిగా ట్రాన్స్‌మిషన్, వీలింగ్, ఏపీఎస్‌ఎల్‌డీసీ (APSLDC) చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
- మౌలిక వసతుల ఖర్చు డెవలపర్లదే: గ్రిడ్‌కు అనుసంధానం కోసం అవసరమైన ఇంటర్ కనెక్షన్ సదుపాయాల నిర్మాణ వ్యయం మొత్తాన్ని సదరు ఉత్పత్తిదారులే భరించాలి. అంతేకాకుండా వాటి నిర్వహణ, మరమ్మతులు, పరికరాల మార్పిడి ఖర్చులు కూడా వారి ఖాతాలోనే వేయనున్నారు.
- ఒప్పందం చేసుకోకుంటే భారీ జరిమానాలు: వాణిజ్య ఒప్పందం లేకుండా గ్రిడ్‌లోకి విద్యుత్‌ను పంపినా, గ్రిడ్ నుంచి తీసుకున్నా భారీ జరిమానాలు, అదనపు చార్జీలు విధిస్తామని ముసాయిదాలో స్పష్టం చేశారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు 3 నెలల్లోగా ఈ ఒప్పందాలు పూర్తి చేయాలని గడువు విధించారు.
సౌర, పవన ప్రాజెక్టులపై 'సాంకేతిక' భారం:
ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా సౌర (Solar), పవన (Wind) విద్యుత్ ప్రాజెక్టుల మనుగడను దెబ్బతీసేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముసాయిదా ప్రకారం ప్రతి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో లో-ఓల్టేజ్ రైడ్ త్రూ (LVRT), హై-ఓల్టేజ్ రైడ్ త్రూ (HVRT), రియాక్టివ్ పవర్ సపోర్ట్ వంటి ప్రత్యేక సాంకేతిక సదుపాయాలతో పాటు పవర్ కంట్రోల్ వ్యవస్థలను తప్పనిసరి చేశారు. దీంతో పాటు ప్రతి ప్రాజెక్టు ఏపీఎస్‌ఎల్‌డీసీతో అనుసంధానమయ్యేలా స్కాడా (SCADA), కమ్యూనికేషన్, డేటా టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
చిన్న, మధ్య తరహా సౌర, పవన ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాన్ని ఈ అదనపు సాంకేతికతలు విపరీతంగా పెంచేస్తాయని, ఇది ఏపీలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను వెనకడుగు వేయించేలా ఉందని పారిశ్రామిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.