చంద్రబాబు హామీలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్..

Published on: 25 Jun 2026, 07:45 AM
News Article

హైదరాబాద్, జూన్ 25 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు మహిళలను దారుణంగా వంచించారని, దీనివల్ల రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లుగా రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేసిందని మండిపడ్డారు. దీనివల్ల ఏటా రూ. 3,000 కోట్ల చొప్పున ఈ రెండేళ్లలో మహిళలకు సుమారు రూ. 6,000 కోట్ల ప్రయోజనం అందకుండా పోయిందని, ఒక్కో సంఘంపై సగటున రూ. 6 లక్షల రుణభారం పడిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ చివరి సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ. 49,696 కోట్ల రుణాలు అందగా, చంద్రబాబు పాలనలో అవి రూ. 41,105 కోట్లకు పడిపోయాయని, ఫలితంగా పెట్టుబడులు తగ్గి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయ వృద్ధి -3.22% నెగటివ్‌కు పడిపోయిందని జగన్ తన ట్వీట్‌లో గణాంకాలతో సహా నిలదీశారు.