చింతలపూడిలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు: 5గురు అరెస్ట్, 160 కేజీల రాగి వైరు స్వాధీనం!

Published on: 27 Apr 2026, 09:25 AM
News Article

చింతలపూడి: గత కొంతకాలంగా రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠాను చింతలపూడి పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు 160 కేజీల రాగి వైరును రికవరీ చేశారు.

అసలేం జరిగిందంటే: ఈ నెల 17న చింతలపూడి గ్రామ శివారున గల బొల్లినేని డుండి అనే వ్యక్తి పొలంలోని 16 KVA ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దొంగలు పగులగొట్టి, అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లారు. ఎలెక్ట్రికల్ ఏఈ పజ్జూరీ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్: ఏలూరు జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ ఐపీఎస్ పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్. సుస్మిత ఆదేశాల మేరకు చింతలపూడి సీఐ టి. క్రాంతి కుమార్, ఎస్ఐ కె. సతీష్ కుమార్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నెల రోజుల పాటు నిఘా ఉంచిన పోలీసులు, సోమవారం నాడు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ముఠా వివరాలు: అరెస్టయిన వారిలో చుండ్రు అనిల్ కుమార్ (సన్నీ), యామర్ల వీరాంజనేయులు (వీరబాబు), అందుగుల వెంకటేశ్వరరావు, షేక్ హుస్సేన్ పాషా ఉన్నారు. వీరితో పాటు ఒక బాలుడిని (Juvenile) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రికవరీ వివరాలు: నిందితులపై చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. వీరు ఇప్పటివరకు 19 ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టినట్లు విచారణలో తేలింది. వీరి వద్ద నుండి సుమారు 160 కేజీల కాపర్ వైరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చింతలపూడి కోర్టులో హాజరుపరచనున్నారు.

ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.