చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా..ఉద్రిక్తత, పోలీసుల అరెస్టులు
హైదరాబాద్ న్యూస్‌టైమ్, చిక్కడపల్లి: హైదరాబాద్‌లోని ప్రముఖ నిరుద్యోగుల అడ్డా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వేదికగా సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల విషయమై అసంతృప్తితో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి మెరుపు ధర్నాకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ.. చిక్కడపల్లి లైబ్రరీ నుండి అశోక్ నగర్ ఎక్స్‌రోడ్స్ వైపు భారీ ర్యాలీగా దూసుకెళ్లారు. ఈ ఆకస్మిక ముట్టడితో అశోక్ నగర్, చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర నెట్టివేత, వాగ్వాదం చోటుచేసుకోగా.. రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులను పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లి, బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. పోలీసుల లాఠీచార్జ్, అరెస్టుల పట్ల నిరుద్యోగ జెఎసి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.