చిన్న షెడ్డులో మొదలై.. ప్రపంచాన్ని లొంగదీసుకున్న నూడుల్స్! సీక్రెట్ తెలుసా?

Published on: 16 Jun 2026, 06:59 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, అంతర్జాతీయ డెస్క్: అర్థరాత్రి ఆకలేసినా, వంట చేయడానికి బద్ధకించినా, బ్యాచిలర్స్ రూమ్స్ నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇళ్ల వరకు.. ఐదు నిమిషాల్లో వేడివేడిగా నోరూరుంచే ఏకైక ఆహారం 'ఇన్‌స్టంట్ నూడుల్స్'. జంక్ ఫుడ్ అని తెలిసి కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దీనిని ఒక 'గిల్టీ ప్లెజర్' (Guilty Pleasure) లా ఆరగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు హెల్త్ కాన్షియస్, ప్లాంట్-బేస్డ్ డైట్స్ (Clean Eating) వైపు మళ్లుతున్న ఈ రోజుల్లో కూడా, ఇన్‌స్టంట్ నూడుల్స్ మార్కెట్ మాత్రం ఊహించని రీతిలో దూసుకుపోతోంది. వివిధ అంచనాల ప్రకారం, 2025లో $64.67 బిలియన్లుగా ఉన్న ఈ గ్లోబల్ ఇండస్ట్రీ విలువ 2023 నాటికి ఏకంగా $98.46 బిలియన్లకు (దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు) చేరుకుంటుందని అంచనా. అసలు ఈ నూడుల్స్ కథ ఎక్కడ మొదలైంది? అంతగా ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?

డబ్బా షెడ్డులో మొదలైన విప్లవం:

1950ల నాటి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌లో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆ సమయంలో ప్రజల ఆకలి తీర్చడం కోసం 'నిస్సిన్ ఫుడ్స్' (Nissin) వ్యవస్థాపకుడు 'మోమోఫుకు ఆందో' (Momofuku Ando) ఒక చవకైన, త్వరగా తయారయ్యే ఆహారం కోసం జపాన్‌లోని ఒసాకాలో ఉన్న తన చిన్న చెక్క షెడ్డులో ప్రయోగాలు మొదలుపెట్టారు. ఒకరోజు భార్య టెంపురా (ఫ్రైడ్ ఐటమ్) వండటం చూసి ఆయనకు ఒక ఐడియా వచ్చింది. నూడుల్స్‌ను ఫ్లాష్-ఫ్రై (Flash-frying) చేయడం ద్వారా అందులోని తేమను తొలగించవచ్చని, ఆ తర్వాత కేవలం వేడి నీళ్లు పోయగానే అవి మళ్లీ తాజా నూడుల్స్‌లా మారిపోతాయని గుర్తించారు. అలా 1958లో ప్రపంచంలోనే మొదటి ఇన్‌స్టంట్ నూడుల్స్ "చికెన్ రామెన్" (Chikin Ramen) పుట్టింది. ఆ తర్వాత 1971లో నిస్సిన్ సంస్థ 'కప్ నూడుల్స్'ను మార్కెట్లోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు ఇంతలా ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?

నూడుల్స్ తింటే గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యత, డిమెన్షియా (మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నా ప్రజలు వీటిని వదలడం లేదు. దీనికి శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం: 'అడిక్షన్' (వ్యసనం). ఈ అల్ట్రా-ప్రోసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే హై-ఎనర్జీ డెన్సిటీ (ఎక్కువ క్యాలరీలు) మరియు ఉప్పు, చక్కెర, కొవ్వుల (Fat, Carbs) కలయిక మెదడుకు ఒకలాంటి కిక్ ఇస్తుంది, దీనివల్ల వీటిని తినడం ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

మరోవైపు నిస్సిన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. అద్భుతమైన రుచి, తక్కువ ధర, సులభంగా దొరకడం, ఎక్కువ రోజులు నిల్వ ఉండటం మరియు భద్రత అనే 5 సూత్రాల వల్లే ఇది ప్రపంచవ్యాప్త 'కంఫర్ట్ ఫుడ్' అయిందని చెబుతున్నారు.నూడుల్స్ నమిలేస్తున్న టాప్ దేశాలు (ఏడాదికి వినియోగం):

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఏకంగా 12,300 కోట్ల (123 Billion) నూడుల్స్ ప్యాకెట్లను జనాలు తినేస్తున్నారు.

  • మొత్తం వినియోగంలో: చైనా మొదటి స్థానంలో (ఏడాదికి 43,802 మిలియన్ ప్యాకెట్లు) ఉండగా, ఇండోనేషియా (14,680 మిలియన్లు) రెండో స్థానంలో, భారతదేశం (8,320 మిలియన్లు) మూడో స్థానంలో ఉన్నాయి.
  • తలసరి వినియోగంలో (Per Capita): వియత్నాం దేశస్తులు ఇందులో రికార్డు సృష్టించారు. అక్కడ సగటున ప్రతి వ్యక్తి ఏడాదికి 81 ప్యాకెట్ల నూడుల్స్ తింటున్నాడు. సౌత్ కొరియా (79 ప్యాకెట్లు), థాయిలాండ్ (58 ప్యాకెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో కూడా స్పైసీ ఆసియా ఫ్లేవర్లకు డిమాండ్ పెరగడంతో, 2024 నాటికి 5.15 బిలియన్ సర్వింగ్స్‌తో యూఎస్ ప్రపంచంలోనే 6వ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది.

ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలోనూ రామెన్ హవా:

ఏసియాస్ 50 బెస్ట్ రెస్టారెంట్లలో 24వ స్థానంలో నిలిచిన హాంగ్‌కాంగ్ 'నేబర్‌హుడ్' రెస్టారెంట్ ప్రముఖ చీఫ్ డేవిడ్ లై సైతం ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు పెద్ద ఫ్యాన్. "ఇదొక చీప్ డోపమైన్ హిట్.. ఆకలిగా ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లో లభించే అద్భుతమైన కంఫర్ట్ ఫుడ్" అని ఆయన అభివర్ణించారు. ఆయన ప్రస్తుతం కొరియన్ నూడుల్స్ దిగ్గజం 'నాంగ్‌షిమ్' (Nongshim) సంస్థతో కలిసి సరికొత్త ఫ్లేవర్‌ను రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్లాక్‌లను బటర్, బీఫ్ ఫ్యాట్, టొమాటో పల్ప్‌తో కలిపి 30 నిమిషాల పాటు ఉడికించి 'స్పగెట్టి' తరహాలో సరికొత్త లగ్జరీ డిష్‌లను కస్టమర్లకు అందిస్తూ నూడుల్స్ లోని సరికొత్త కోణాన్ని చూపిస్తున్నారు.

న్యూట్రీషన్ నూడుల్స్ వైపు అడుగులు:

నూడుల్స్ తింటే అన్-హెల్దీ అనే ముద్రను చెరిపేసేందుకు జపనీస్ కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. నిస్సిన్ సంస్థ తాజాగా ‘కాన్జెన్ మెషి’ (Complete Nutrition) అనే సరికొత్త ప్రొడక్ట్ లైన్‌ను తీసుకొచ్చింది. ఇది నూడుల్స్ రుచిని ఏమాత్రం మార్చకుండానే.. శరీరానికి కావలసిన 33 రకాల అవసరమైన పోషకాలను (Nutrients) అందిస్తుంది. ఇన్‌స్టంట్ ఫుడ్ ద్వారానే ఆరోగ్యాన్ని కూడా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.

విపత్తుల్లో ఆదుకునే ఆపద్బాంధవుడు:

వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వరల్డ్ ఇన్‌స్టంట్ నూడుల్స్ అసోసియేషన్ (WINA) ఇప్పటివరకు 53 సందర్భాలలో దాదాపు 80 లక్షల నూడుల్స్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసింది. సర్వస్వం కోల్పోయిన బాధితులకు వేడివేడి నూడుల్స్ సూప్ ఒక శారీరక, మానసిక భరోసానిస్తుందని వారి నమ్మకం.

భారత్‌లో మసాలా నూడుల్స్ నుండి బ్రెజిల్‌లో చురాస్కో (బార్బెక్యూ) రామెన్ వరకు.. దేశాల సంస్కృతులను బట్టి ఇన్‌స్టంట్ నూడుల్స్ రూపాంతరం చెందుతూ, నేటి బిజీ లైఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఒక విడదీయరాని గ్లోబల్ ఫుడ్ కల్చర్‌గా మారిపోయాయి.