చిన్నన్నకు రేవంత్ వెన్నుపోటు.. నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ రాజకీయ జీవితానికి తెర!
హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ జి. చిన్నారెడ్డి రాజకీయ ప్రయాణానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో తెరపడింది. ఒకప్పుడు వనపర్తిలో చిన్నన్న గురించి గోడలపై నినాదాలు రాశానని బహిరంగ సభల్లో పొగిడిన రేవంత్ రెడ్డి.. నేడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాజకీయ జీవితానికి సున్నం పెట్టారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఎన్నికల్లో చిన్నారెడ్డికి కేటాయించాల్సిన ఎమ్మెల్యే సీటును, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తన జోక్యంతో మేఘారెడ్డికి కట్టబెట్టారని సమాచారం. వనపర్తిలో చిన్నారెడ్డి గెలిస్తే భవిష్యత్‌లో సీఎం సీటుకు పోటీగా వస్తాడనే భయంతోనే ఆయనకు రావాల్సిన సీటును పక్కన పెట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజీవ్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చిన్నారెడ్డిని.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంను చేయాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భావించి ఢిల్లీ నుంచి ప్రత్యేక దూతలను పంపి మరీ విచారించిన చరిత్ర ఆయనకుంది.
తన టికెట్ మేఘారెడ్డికి వెళ్లడం వెనుక జరిగిన కుట్రలను ఆలస్యంగా తెలుసుకున్న చిన్నారెడ్డి, ఇటీవల పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొండా సురేఖ ఎపిసోడ్‌ను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ క్రీడలో.. చిన్నారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో అంకితభావంతో ముడిపడిన రాజకీయ జీవితంలో.. ఈ అవమానకర తొలగింపును ఆయన బహుమతిగా అందుకున్నారు. ఈ పరిణామాల తర్వాత చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? లేక తీవ్ర అవమాన భారంతో పార్టీ వీడతారా అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.