చిన్నారుల భవిష్యత్తు కోసం రెండు పోలియో చుక్కలు..
సంస్థాన్ నారాయణపురం, జూన్ 28 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, పోలియో రహిత దేశాన్ని నిర్మించడం మనందరి లక్ష్యం కావాలని సంస్థాన్ నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నర్రి లింగస్వామి అలియాస్ ఆరో తేజ్ అన్నారు. ఆదివారం ప్రభుత్వం నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వేసే ఈ చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని, చిన్నారుల ఆరోగ్యమే పరమావధిగా తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ పిల్లలకు రెండు చుక్కలు వేయించి జీవితాంతం రక్షణ కల్పించాలని కోరారు. ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు, పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లింగస్వామి సూచించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.