చెత్త కోసం రక్తపాతం..గురుగ్రామ్‌లో రెండు వర్గాల మధ్య కాల్పులు..

Published on: 08 May 2026, 05:52 PM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 08, 2026

గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో చెత్త కుప్పల వద్ద ప్లాస్టిక్ ఏరుకునే విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు కాల్పులకు దారితీసింది. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ యార్డులో పారబోసిన చెత్త నుండి ప్లాస్టిక్ వస్తువులను ఏరుకునే క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్తా ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ హింసాత్మక ఘర్షణలో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఇదే సమయంలో ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో, ఓ యువకుడి కాలికి బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. కాల్పుల్లో గాయపడిన వ్యక్తితో పాటు మరికొందరు ఈ గొడవలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.