గుంటూరు, అక్టోబర్ 1, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): గుంటూరు జిల్లాలో ప్రేమ విఫలమైందో ఏమో గానీ, ఓ బాలిక, యువకుడు బలవన్మరణానికి పాల్పడిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలుకల మందు తిని, చెరువులో దూకి ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న వైనం స్థానికంగా విషాదం నింపింది.
గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలో తన తాత, అమ్మమ్మ వద్ద ఉంటున్న పదిహేనేళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆ పాఠశాల బస్సుకు సాంబశివరావు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ఆయన కొడుకు విఘ్నేష్ (22) ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి కోసం తరచూ స్కూల్ వద్దకు వెళ్తున్న విఘ్నేశ్‌కు ఆ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా క్రమంగా ప్రేమకు దారితీసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆ బాలిక, విఘ్నేష్ అకస్మాత్తుగా ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగానే, బుధవారం ఉదయం కోనంకి గ్రామ చెరువు వద్ద వారు విగతజీవులుగా పడి ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు వారు ఎలుకల మందు తిని, ఆపై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.