చేనేత కార్మికుల ఇబ్బందులపై తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రం
సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో చేనేత కార్మికులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ నారాయణపూర్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. నారాయణపూర్ మండల ఎంపీడీవో ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిలను కలిసి ఈ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కల్లు గీత కార్మికులకు వారి సహకార సంఘ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్నే అర్హతకు ప్రామాణికంగా గుర్తిస్తుండగా, చేనేత కార్మికులకు మాత్రం చేనేత, జౌళి శాఖ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయడం సమంజసం కాదని అన్నారు. చేనేత సహకార సంఘాల్లో సభ్యుల పూర్తి వివరాలు, వృత్తి సంబంధిత సమాచారం అధికారికంగా నమోదు చేయబడి ఉంటాయని, అలాంటప్పుడు వేరే ధ్రువీకరణ కోరడం వల్ల పేద చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సహకార సంఘ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్నే చెల్లుబాటు అయ్యే ఆధారంగా గుర్తించి, సంఘంలో సభ్యత్వం కలిగి 50 సంవత్సరాలు నిండిన అర్హులైన పేద చేనేత కార్మికులందరికీ చేయూత పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం కార్యదర్శి దోర్నాల అంజయ్య, డైరెక్టర్లు మేకని యాదగిరి, సురపల్లి రాములు, మేనేజర్ వెంకటేశం, మేకల రామకృష్ణ, దోర్నాల శ్రీనివాస్, గుర్రం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.