చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

Published on: 01 Jul 2026, 01:51 PM
News Article

చౌటుప్పల్, జూలై 01, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ మొగుదల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోని వైద్యులకు మరియు సిబ్బందికి చైర్మన్ పూలబొకేలు అందించి, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో డాక్టర్లకు దేవునితో సమానమైన స్థానం ఉందని, ప్రాణదాతలైన వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కృషి అభినందనీయమని, ముఖ్యంగా కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో మరియు ఇతర అత్యవసర సమయాల్లో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అందించిన సేవలు మరువలేనివని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండి హను బాయ్, కో-ఆప్షన్ నెంబర్ బాబా షరీఫ్, డిసిసి కార్యదర్శి చింతల సాయిలు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.