చౌటుప్పల్ హత్య కేసులో 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు!
చౌటుప్పల్, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసుకు సంబంధించి పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసును విజయవంతంగా ఛేదించారు. మృతుడు రాపోలు దానయ్య (36) హత్య వెనుక భార్య అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.
ఘటన నేపథ్యం: మండలంలోని పంతంగి గ్రామం శనగలగుట్ట వద్ద అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య హత్యకు గురైనట్లు సమాచారం అందిన వెంటనే చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ జె. మన్మథ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో సేకరించిన కీలక ఆధారాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
విచారణలో వెలుగుచూసిన నిజాలు: పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. మృతుడు దానయ్య భార్య రాపోలు శారద (34)కు, అదే గ్రామానికి చెందిన సొంత బావ కుమారుడైన రాపోలు శివ (19) మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది. ఈ వివాహేతర సంబంధానికి భర్త దానయ్య అడ్డుగా ఉన్నాడనే కక్షతో శారద తన ప్రియుడు శివతో కలిసి హత్యకు పథకం పన్నింది. ఈ నెల 23న మధ్యాహ్నం సమయంలో దానయ్యపై రాయితో దాడి చేసి, అనంతరం కర్రతో తలపై తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.
నిందితుల రిమాండ్: ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు రాపోలు శివ (డ్రైవర్), రాపోలు శారద (కూలీ)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్ జె. మన్మథ కుమార్, ఎస్‌ఐలు కె. యాదగిరి, పి. రవీందర్, బి. అజయ్ భార్గవ్ అలాగే సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.