చౌటుప్పల్‌లో ఘనంగా మద్దెలమ్మ బోనాల పండుగ

Published on: 27 Aug 2026, 04:23 PM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 27, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠ నగర్‌లో కొలువైన శ్రీ శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి పదవ వార్షిక బోనాల మహోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం స్థానిక మార్కండేయ స్వామి దేవాలయం నుండి మహిళలు నూతన వస్త్రాలు ధరించి, భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అక్కడి నుంచి రామాలయం పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని సాయంత్రం శ్రీ శ్రీ మద్దెలమ్మ మాత నాట్య కళామండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన సారంగధర యక్షగాన ప్రదర్శన స్థానిక ప్రజలను, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామితో పాటు బడుగు లక్ష్మయ్య, బడుగు జయప్రకాష్, గోశిక అంజయ్య, వనం రాజు, చిక్క నరహరి, గోశిక కరుణాకర్, పెద్ది కృష్ణ, కందగట్ల ఆనంద్, పిల్లలమర్రి యాదగిరి, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, గోశిక పాండు, శాంతి శ్రీ, కోడి వనిత, బడుగు పావని, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, గోశిక రవి, గజం బృహ మహర్షి, కోడి నరసింహ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.