చౌటుప్పల్‌లో రోడ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం..

Published on: 09 Sep 2026, 12:31 PM
News Article

చౌటుప్పల్, సెప్టెంబర్ 9, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): చౌటుప్పల్ టౌన్‌లోని అరబిందో జూనియర్ కాలేజ్ సమీపంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం, అలాగే అతివేగం వల్ల జరిగే ప్రాణనష్టాల గురించి వివరించారు. అదేవిధంగా, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండాల్సిన అవసరంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలు, వాటికి దూరంగా ఉండాల్సిన పద్ధతుల గురించి విద్యార్థులకు హితవు పలికారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, రోడ్డు భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు.