హైదరాబాద్, నవంబర్ 28, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్టు వనం వెంకటరమణ కుటుంబానికి తోటి జర్నలిస్టులు అండగా నిలిచారు. సొసైటీ సభ్యులు సమకూర్చిన రూ.50,000 ఆర్థిక సహాయాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య శనివారం అంబర్‌పేటలోని వెంకటరమణ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
జర్నలిస్టుల సంక్షేమ హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసింది: ఈ సందర్భంగా మామిడి సోమయ్య మీడియాతో మాట్లాడుతూ.. వనం వెంకటరమణ గుండెపోటుతో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరమణ లాంటి ఎంతోమంది పాత్రికేయులు జర్నలిజం వృత్తిని నమ్ముకుని పేదరికంలోనే జీవనం సాగిస్తున్నారని, సరైన వేతనాలు, ఇతర ఆదాయ మార్గాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీల్లో ఏ ఒక్కదానినీ అమలు చేయకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు.
హెల్త్ కార్డులు, పింఛన్ సదుపాయం కల్పించాలి: ప్రభుత్వం కనీసం ఉచిత వైద్య సదుపాయం కల్పించకపోవడం వల్లే ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కూడా తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సొంతింటి కల నెరవేరకుండానే ఎందరో పాత్రికేయులు కన్నుమూస్తున్నారని ఆవేదన చెందారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పాత్రికేయులకు పింఛన్ సదుపాయం అమలవుతుండగా, తెలంగాణలో మాత్రం ఆ ఊసే లేదని అన్నారు. అలాగే, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులను వాడుకుని వదిలేస్తున్నాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులకు జర్నలిస్టులే అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా నాయకులు వి. రవికుమార్, వర్కాల కిష్టయ్య, శ్రీధర్, వెంకటరమణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.