జలమండలిలో అవినీతి తిమింగలం: ఆస్తులు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Published on: 19 May 2026, 05:41 AM
News Article
  • సోదాల్లో బయటపడ్డ అక్రమ సామ్రాజ్యం
  • మార్కెట్ విలువ రూ.100 కోట్లు
  • ఇంట్లో కోటి రూపాయల క్యాష్
  • కిలో గోల్డ్, HYDలో 9 ఫ్లాట్లు గుర్తింపు



హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: హైదరాబాద్ జలమండలి (HMWSSB) రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ (GM) కుమార్ ఇళ్లే లక్ష్యంగా ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో బయటపడ్డ అక్రమ ఆస్తుల కొండను చూసి విచారణాధికారులే నోరెళ్లబెట్టారు. మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని ఆయన నివాసంలో సోదాలు చేయగా.. కంటికి కనిపించిన చోటల్లా కరెంటు నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు గుట్టలుగా లభించాయి. లెక్కింపులో ఏకంగా రూ. 1.05 కోట్ల నగదు, కిలో బరువున్న నిఖార్సైన బంగారు సొమ్ము తేలడంతో అధికారులు వాటిని తక్షణమే సీజ్ చేశారు. ఇంతటితో ఆగకుండా కుమార్ సంపాదించిన బినామీ ఆస్తుల డాక్యుమెంట్లను పరిశీలించగా.. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోనే 9 విలాసవంతమైన ఫ్లాట్లు, నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల విలువైన వ్యవసాయ భూమి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 100 కోట్ల పైమాటేనని అంచనా వేస్తున్నారు. కేవలం ఒక డివిజన్ జీఎంగా ఉంటూ ఈ స్థాయిలో లంచాలు, అవినీతితో అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించిన ఈ అవినీతి తిమింగలం కుమార్ వ్యవహారం ఇప్పుడు జలమండలితో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.