జీవన్ రెడ్డిపై మంత్రి అడ్లూరి ఫైర్
జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు:
జీవన్ రెడ్డి పార్టీ మారడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ జీవన్ రెడ్డిని గౌరవించారని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా "అన్నా.. నువ్వు బాధపడకు" అంటూ స్వయంగా ఫోన్ చేసి భరోసా ఇచ్చారని అడ్లూరి వెల్లడించారు. ఓడిపోయినా సరే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
పదేళ్లు విమర్శించి.. ఇప్పుడు అదే పార్టీలోకా?
గడిచిన పదేళ్ల పాటు కేసీఆర్ పాలనను, వారి పార్టీని తీవ్రంగా విమర్శించిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, కేవలం జీవన్ రెడ్డే స్వార్థం కోసం మార్పు కోరుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
హెచ్చరించినా వినలేదా?
మహేష్ గౌడ్, శ్రీధర్ బాబు వంటి నేతలు కూడా జీవన్ రెడ్డిని పార్టీ మారొద్దని సూచించారని మంత్రి పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు ఇలా పార్టీ మారడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు.