టోక్యో జూలో విషాదం: వడదెబ్బతో మూడు సింహాలు మృతి
Published on: 04 Aug 2026, 02:42 PM
టోక్యో, ఆగస్ట్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): జపాన్ రాజధాని టోక్యోలోని టామూ జూలాజికల్ పార్క్‌లో (Tama Zoological Park) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత వారంలో తీవ్రమైన ఎండలు, వడదెబ్బ (Heatstroke) కారణంగా మూడు ఆడ సింహాలు మృతి చెందాయని జూ అధికారులు వెల్లడించారు. జూ చరిత్రలో గత 62 ఏళ్ల కాలంలో సింహాలు వడదెబ్బతో మృతి చెందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మృతి చెందిన సింహాల వయస్సు 3, 11, మరియు 15 సంవత్సరాలు కాగా, అన్నీ అక్కడే పుట్టినవేనని అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నివేదికల ప్రకారం.. ఆ సింహాలు తీవ్రమైన నిర్జలీకరణ (Severe dehydration), బహుళ అవయవ వైఫల్యం (Multiple organ failure) లక్షణాలతో మరణించినట్లు నిర్ధారించారు. అయితే దీనిపై పూర్తి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
- అసలేం జరిగింది? జూలై మధ్యలో టోక్యోలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా సుమారు 39 డిగ్రీల సెల్సియస్ (102°F) వరకు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జూలోని మొత్తం 16 సింహాలలో ఎక్కువ భాగం ఆహారం మానివేసి, తీవ్ర నీరసానికి గురయ్యాయి. కొన్ని సింహాలు కోలుకున్నప్పటికీ, మరికొన్నింటికి నడవలేని పరిస్థితి, స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి.
- తీసుకుంటున్న ముందస్తు చర్యలు: సింహాల ఆరోగ్యం క్షీణించడంతో జూ అధికారులు జూలై 23 నుంచే సందర్శకులను నిలిపివేశారు. ప్రస్తుతం మిగతా సింహాలకు సెలైన్లు (IV drips) ఎక్కిస్తూ, నీరు పిచికారీ చేస్తూ అత్యంత జాగ్రత్తగా చికిత్స అందిస్తున్నారు. ఇతర జంతువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని, అయినప్పటికీ సిబ్బందిని అప్రమత్తం చేశామని జూ వర్గాలు వెల్లడించాయి. సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతానికి చెందిన సింహాలు అక్కడి పొడి వేడికి అలవాటుపడతాయని, టోక్యోలో ఉండే విపరీతమైన ఉక్కబోత, తేమతో కూడిన వాతావరణం (Heat and high humidity) వల్ల వాటి శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేకపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.