డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట భారీ మోసం: మైనంపల్లి అనుచరులు అరెస్ట్..
హైదరాబాద్, జూన్ 25 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు అనుచరులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్ పరిధిలో దాదాపు 100 మంది పేద ప్రజల నుండి ఇండ్లు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక్కొక్కరి వద్ద రూ. 50 వేల నుండి రూ. 1 లక్ష వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ పత్రాలు స్వాధీనం – ముగ్గురి అరెస్ట్: బాధితుల్లో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మోసంలో కీలక పాత్ర పోషించిన తిమ్మిరి గోపీనాథ్ పుష్పలత (A2), తిమ్మిరి గోపీనాథ్ విశాల్ (A3), మహేందర్ సింగ్ (A6)లను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 79 నకిలీ ఇంటి కేటాయింపు పత్రాలను (Fake Allotment Letters), మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితులు పరారీ: ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జయరాజ్ గంగాధరన్ (A1), నిషా రాజ్ (A4), చింటూ రాజ్ (A5)లతో పాటు రాజ్ & కో. రబ్బర్ స్టాంప్స్ (A7) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చీటింగ్ కేసులు నమోదు చేశామని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అల్వాల్ పోలీసులు స్పష్టం చేశారు.