డాక్టర్ సలహా లేకుండా విటమిన్ పిల్స్ వద్దు.. జాతీయ నివేదికలో షాకింగ్ నిజాలు!
హైదరాబాద్, జూన్ 29 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఈ మధ్య కాలంలో విటమిన్-డి, మెగ్నీషియం, మల్టీవిటమిన్లు, కొల్లాజెన్, హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్ (మూలికా రసాలు) వంటి డైటరీ సప్లిమెంట్లను వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, అడ్వర్టైజ్మెంట్లు చూసి చాలామంది డాక్టర్ల సలహా లేకుండానే ఇష్టమొచ్చినట్లు ఈ ‘నేచురల్’ పిల్స్ (మాత్రలు) మింగేస్తున్నారు. అయితే, ‘నేచురల్’ అని బోర్డులు తగిలించినంత మాత్రాన అవన్నీ సురక్షితం కావని, వీటిని మితిమీరి వాడితే లివర్ (కాలేయం), కిడ్నీలు (మూత్రపిండాలు) తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
20% లివర్ డ్యామేజ్ వీటి వల్లే! ప్రముఖ లివర్ మెడిసిన్ నిపుణులు ప్రొఫెసర్ జివ్ బెన్ అరి నేతృత్వంలోని అధ్యయనాల ప్రకారం.. ప్రస్తుతం వస్తున్న లివర్ ఫెయిల్యూర్, కాలేయ సమస్యల కేసుల్లో దాదాపు 20 శాతం వరకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే హెర్బల్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్ల వల్లే జరుగుతున్నాయని తేలింది. బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, ఎనర్జీ సప్లిమెంట్ల పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రొడక్ట్లలో కొన్నిసార్లు ప్యాకెట్ మీద రాయనటువంటి స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, టాక్సిన్స్ (విషపూరిత రసాయనాలు) కూడా ల్యాబ్ పరీక్షల్లో బయటపడ్డాయి. ఇవి నేరుగా లివర్‌పై ప్రభావం చూపుతాయి. అలాగే విటమిన్-డి ని మితిమీరి వాడితే రక్తంలో కాల్షియం పెరిగి కిడ్నీలు పాడవుతాయని క్లినికల్ డైటీషియన్ మిచల్ సుక్మాన్ స్పష్టం చేశారు.
మందులతో రియాక్షన్.. ఇవే లక్షణాలు: మనం రెగ్యులర్‌గా వాడే బీపీ, షుగర్ లేదా రక్తం గడ్డకట్టకుండా వాడే (Anticoagulant) మందులతో కలిపి ఈ సప్లిమెంట్లను వేసుకున్నప్పుడు బాడీలో ప్రమాదకరమైన డ్రగ్ ఇంటరాక్షన్స్ జరిగి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఐరన్, కాల్షియం, మెగ్నీషియంలను ఒకేసారి వాడితే ఒకదాని అబ్సార్ప్షన్‌ను (గ్రహింపును) ఇంకొకటి దెబ్బతీస్తుంది. ఒకవేళ సప్లిమెంట్లు వాడేటప్పుడు విపరీతమైన అలసట, వాంతులు, కడుపునొప్పి, మూత్రం ముదురు రంగులోకి మారడం, కళ్లు పచ్చబడటం (కామెర్లు) వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా వాగుడు చూసి కాకుండా, బ్లడ్ టెస్ట్ చేయించుకుని బాడీలో నిజంగా విటమిన్ లోపం ఉంటేనే డాక్టర్ సలహా మేరకు సరైన డోసులో మాత్రమే వీటిని వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.