డిప్రెషన్‌తో బిల్డింగ్‌పై నుండి దూకి తల్లి ఆత్మహత్య

Published on: 12 Jun 2026, 05:28 PM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, హైదరాబాద్, జూన్ 12, 2026: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల‌విసే తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర మానసిక ఒత్తిడి (డిప్రెషన్) కారణంగా ఒక తల్లి తన ఆరు నెలల కన్నపాపతో కలిసి అపార్ట్‌మెంట్ భవనం పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మియాపూర్‌ మయూరి నగర్ పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఈషా సాహు (37) అనే మహిళ, శుక్రవారం తన ఆరు నెలల కుమార్తెను గుండెలకు హత్తుకుని భవనంలోని ఆరవ అంతస్తు నుండి అకస్మాత్తుగా కిందకు దూకేసింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె చేతుల్లో ఉన్న పసికందు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతురాలికి రెండవ సంతానంగా ఈ పాప జన్మించినప్పటి నుండి ఆమె 'పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్' (ప్రసవానంతర మానసిక ఒత్తిడి) బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు, ఆ మానసిక వేదన తట్టుకోలేకనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడంతో పాటు, ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.