డేవిడ్ వార్నర్ అరెస్టు
హైదరాబాద్ న్యూస్‌టైమ్ డెస్క్: మైదానంలో తనదైన దూకుడుతో చెలరేగే ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు పీకలదాకా తాగి అడ్డంగా బుక్కయ్యాడు. సిడ్నీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ (డ్రంక్ అండ్ డ్రైవ్) పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ (మరౌబ్రా ప్రాంతం)లో ఆదివారం సాయంత్రం (ఏప్రిల్ 5, 2026 న) పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో తన వ్యాన్‌లో అటుగా వచ్చిన వార్నర్.. పోలీసుల బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కేంద్రానికి కొద్దిగా ముందుగానే తన వాహనాన్ని ఆపేసి పార్క్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి తనిఖీ చేయగా, అతను పీకలదాకా మద్యం సేవించినట్లు తేలింది.
అనుమతించిన దానికంటే రెట్టింపు మోతాదులో.. వెంటనే పోలీసులు వార్నర్‌ను అదుపులోకి తీసుకుని మరౌబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ నిర్వహించిన రెండో దశ పరీక్షల్లో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం అనుమతించిన దానికంటే ఇది రెట్టింపు మోతాదు కావడం గమనార్హం.
మే 7న కోర్టుకు హాజరు.. ప్రస్తుతం వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్‌ల మధ్యలో కొద్దిరోజులు విరామం దొరకడంతో ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన ఇలా పోలీసులకు పట్టుబడ్డాడు. అరెస్టు అనంతరం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం వచ్చే నెల (మే 7వ తేదీన) డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడుతూ బిజీగా ఉన్నాడు.