తండ్రి జంక్ ఫుడ్ తింటే పిల్లల్లో ఆ సమస్య తప్పదా?
Published on: 02 Aug 2026, 03:51 PM
హైదరాబాద్, ఆగస్ట్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారమే బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఇప్పటివరకు అందరూ భావిస్తారు. అయితే, కేవలం తల్లి ఆరోగ్యం మాత్రమే కాకుండా.. తండ్రి తినే ఆహారపు అలవాట్లు కూడా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన సరికొత్త అధ్యయనంలో వెల్లడైంది.
సోడా, చిప్స్, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్డ్ సీరిల్స్ వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (జంక్ ఫుడ్) తండ్రి ఎక్కువగా తీసుకుంటే.. పుట్టబోయే పిల్లలు సాధారణం కంటే ఎక్కువ బరువుతో పుట్టడమే కాకుండా, వారి తొడలు, నడుము భాగంలో కొవ్వు (Love handles) ఎక్కువగా చేరుతుందని ఈ పరిశోధన తేల్చింది.
- అధ్యయనంలోని ముఖ్యాంశాలు:
- ఎపిజెనెటిక్స్ ప్రభావం: తండ్రి తినే జంక్ ఫుడ్ వల్ల శరీరంలో మంట (inflammation) పెరిగి, అది శుక్రకణాలపై (sperm) ప్రభావం చూపుతుంది. దీనివల్ల పిండం ఎదుగుదలకు కారణమయ్యే 'IGF-II' జన్యువులో మార్పులు వచ్చి, బిడ్డ బరువు పెరిగేలా మారుస్తుంది.
- భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు: పుట్టేటప్పుడు పిల్లలు అధిక బరువుతో ఉంటే.. భవిష్యత్తులో వారికి గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, పిల్లలు బోర్లా పడటం, పాకడం, నడవడం వంటి శారీరక మైలురాళ్లను చేరుకోవడంలో కాస్త ఆలస్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- తల్లి, తండ్రి ప్రభావంలో తేడా: తండ్రి జంక్ ఫుడ్ తింటే పిల్లలు అధిక బరువుతో పుడుతుండగా.. గర్భధారణ సమయంలో తల్లులు అటువంటి పోషకాలు లేని ఆహారాలు తీసుకుంటే మాత్రం పిల్లలు తక్కువ బరువు, తక్కువ ఎత్తుతో పుట్టే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి: కూఎలాంటి పోషకాలు లేకుండా, కేవలం కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, స్వీటెనర్లు కలిపి ల్యాబ్‌లలో తయారు చేసే కూల్ డ్రింక్స్, ప్యాకెట్ బిస్కెట్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్, సాసేజ్‌లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తండ్రుల ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యకరమైన భావి తరాలకు పునాది అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.