తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Published on: 17 Apr 2026, 09:36 AM
News Article

హైదరాబాద్‌లో: పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఓ బీటెక్ విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా చిత్రాయి గ్రామానికి చెందిన చెన్నకేశవరెడ్డి కుమార్తె జ్ఞానశ్రీ (21) స్థానిక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇటీవల మార్చి 31న ఆమె తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. అప్పటి నుండి తండ్రి లేడనే మనోవేదనతో ఉన్న జ్ఞానశ్రీ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

సమాచారం అందుకున్న పెట్ బషీరాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె హాస్టల్ గదిలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి మరణించిన కొద్ది రోజులకే కూతురు కూడా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.