తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..టీవీకే ప్రభుత్వానికి అన్నాడీఎంకే మద్దతు!
(చెన్నై - హైదరాబాద్ న్యూస్‌టైమ్ బ్యూరో): తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అనూహ్య పరిణామాల మధ్య అన్నాడీఎంకే (AIADMK) పార్టీ, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అన్నాడీఎంకే సీనియర్ నేత సి.వి. షణ్ముగం కీలక ప్రకటన చేశారు. ప్రజాతీర్పును గౌరవిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీవీకే ప్రభుత్వానికి అన్నాడీఎంకే శాసనసభాపక్షం మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
ఈపీఎస్ ప్రతిపాదన తిరస్కరణ: ఈ సందర్భంగా షణ్ముగం సంచలన విషయాలను బయటపెట్టారు. డీఎంకే మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదించారని, అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఏ పార్టీతోనూ కూటమిలో లేదని, త్వరలో కొత్త కూటమి ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే టీవీకే ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇవ్వాలని మెజారిటీ ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
కొత్త నాయకత్వంలో శాసనసభాపక్షం: పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎస్పీ వేలుమణిని, ఉపనేతగా జి. హరిని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వేలుమణి మాట్లాడుతూ.. "అన్నాడీఎంకేను చీల్చే ఉద్దేశం మాకు లేదు. పార్టీ మనుగడ, కార్యకర్తల ప్రయోజనాలే మాకు ముఖ్యం. మేము ఐక్యంగా ఉంటాం" అని పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఎడప్పాడి పళనిస్వామి పట్టు సడలినట్లయిందని, అన్నాడీఎంకేలో కొత్త నాయకత్వం తెరపైకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ ప్రభుత్వానికి బలం: సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి, అన్నాడీఎంకే మద్దతు లభించడం తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉంటూనే, ప్రభుత్వ స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం.