తెలంగాణ సెక్రటేరియట్‌లో 'చాయ్' లొల్లి: బిల్లుల కోసం కాంట్రాక్టర్ల కక్కుర్తి!

Published on: 08 Jul 2026, 05:37 AM
News Article

హైదరాబాద్, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 'చాయ్' బిల్లుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల పేషీల్లో వినియోగించే టీ, కాఫీ బిల్లుల విషయంలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అసలు జరుగుతున్న వినియోగానికి, కాంట్రాక్టర్లు సమర్పిస్తున్న బిల్లులకు అస్సలు పొంతన లేకపోవడంతో ఈ 'చాయ్ లొల్లి' బయటపడింది.

అంకెల్లో అసలు బండారం: సచివాలయంలోని వివిధ విభాగాల్లో నమోదైన లెక్కలు విస్తుగొలిపేలా ఉన్నాయి:

  • CPRO ఆఫీసు: నెలకి ఏకంగా 10 వేల చాయ్‌లు.
  • చీఫ్ సెక్రటరీ (CS) ఆఫీసు: నెలకు 8 వేల చాయ్‌లు.
  • సెక్రటరీల పేషీలు: నెలకు 5 వేల చాయ్‌లు చొప్పున బిల్లులు వేస్తున్నారు.

వాస్తవంగా చూస్తే అక్కడ సరఫరా అయ్యేవి సుమారు 1,500 చాయ్‌లు మాత్రమేనని, కానీ బిల్లులు మాత్రం పది రెట్లు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు గుర్తించారు.

బిల్లుల కోసం కక్కుర్తి.. సేవలు బంద్‌: ప్రభుత్వం బిల్లులను సకాలంలో చెల్లించడం లేదని ఆరోపిస్తూ, కాంట్రాక్టర్లు బిల్లులను ఇష్టానుసారంగా పెంచి వేస్తున్నారు. టీ, కాఫీ బిల్లులే కాకుండా, టిఫిన్లు మరియు భోజనాల సరఫరాలో కూడా ఇదే తరహా అవకతవకలు జరుగుతున్నట్లు సమాచారం. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందనే సాకుతో ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు టిఫిన్లు, భోజనాల సరఫరాను నిలిపివేయడంతో సచివాలయంలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో భోజనం, స్నాక్స్ బిల్లుల్లో జరిగిన అక్రమాల తరహాలోనే, ఇప్పుడు చాయ్, కాఫీ బిల్లుల్లోనూ పెద్ద ఎత్తున గోల్ మాల్ జరుగుతుండటంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.