తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై సీఎం రేవంత్ రెడ్డి సమరం..
హైదరాబాద్, జూన్ 24 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణకు దక్కాల్సిన తుంగభద్ర నికర జలాల వాటాలో జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జలసౌధలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో, ప్రస్తుతం అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో సుమారు 83,987 ఎకరాల ఆయకట్టు ఎండిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో రేపు జరగనున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని బలంగా వినిపించాలని నిర్ణయించారు. ఆర్డీఎస్ (RDS) ఆనకట్ట ప్రస్తుత ప్రమాదకర స్థితిని, ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల్లోని జాప్యాన్ని సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే రూ. 59 కోట్లు డిపాజిట్ చేసినా ప్యాకేజీ 1, 2 పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, 2004 నాటి నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు కర్ణాటక పరిధిలో పేరుకుపోయిన పూడికను తొలగించేలా చూడాలని, ఇందుకోసం ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయించారు. వీటితో పాటు తుమ్మిళ్ల నుంచి నీటి వినియోగానికి కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.