తెలంగాణలో ఇంటర్ బోర్డు రద్దు?
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 07, 2026
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో భారీ మార్పులకు రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దశాబ్దాలుగా స్వతంత్రంగా ఉన్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ విలీన ప్రక్రియ తెరపైకి వచ్చింది. అయితే, ఈ నిర్ణయం విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజుల ముందు, మే 8 నుండి మొదలవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు అకస్మాత్తుగా ఆదేశాలు జారీ చేసింది. మే 4న విడుదల చేసిన అడ్మిషన్ షెడ్యూల్ సర్క్యులర్‌ను విద్యాశాఖ తాత్కాలికంగా రద్దు చేయడంతో గందరగోళం నెలకొంది.
ఈ విలీన ప్రక్రియపై ఇంటర్ జేఏసీ (Inter JAC) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. బోర్డు రద్దు ఆలోచన "తుగ్లక్ చర్య" అని మండిపడ్డారు. ఇప్పటికే సమ్మర్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ అకస్మాత్తు మార్పుల వల్ల తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అడ్మిషన్లు ఆగిపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇలాంటి సంస్కరణలు చేపట్టే ముందు కనీసం ఏడాది క్రితమైనా నోటీసు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆకునూరి మురళి ఇటువంటి సలహాలే ఇచ్చి జగన్ ప్రభుత్వం ఓటమికి కారణమయ్యారని, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అడ్మిషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జేఏసీ హెచ్చరించింది.