తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం: జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరామిరెడ్డి

Published on: 11 Aug 2026, 02:32 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామంలో రైతు మల్లేపల్లి ప్రముఖ్ రెడ్డి నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రంలో చేపడుతున్న తేనెటీగల పెంపకాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరామిరెడ్డి మంగళవారం సందర్శించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని 'రైతు నేస్తం' కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. క్షేత్రంలో తేనెటీగల పెంపకం, సంరక్షణ, తేనె సేకరణ విధానాలను అధికారులు పరిశీలించారు. వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకాన్ని అనుబంధ ఉపాధి మార్గంగా చేపడితే రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని, తక్కువ స్థలంలో నిర్వహించడమే కాక పంటల పరాగసంపర్కానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ చైర్మన్ నిమ్మల రామచంద్రయ్య పాల్గొని స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి, మెరుగైన ఆదాయం పొందే మార్గాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.పూజ, ఏఈవో కె.రాజేష్, రైతులు మాధవరెడ్డి, మల్లేపల్లి ప్రముఖ్ రెడ్డి, అంజిరెడ్డి, ఏపూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.