హైదరాబాద్, నవంబర్ 27, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): డిజిటల్ యాప్‌ల వినియోగం ఎంతగా పెరిగినప్పటికీ, స్వచ్ఛమైన పాల కోసం నేరుగా రైతులపైనే ఆధారపడటంలో హైదరాబాద్ నగరవాసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని 'గోద్రెజ్ జెర్సీ' సంస్థ విడుదల చేసిన 'లాక్టోగ్రాఫ్ 2.0' (Lactograph 2.0) సర్వే నివేదికలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, హైదరాబాద్‌లో 38 శాతం మంది వినియోగదారులు నేరుగా పాడి రైతుల నుంచే పాలను కొనుగోలు చేస్తున్నారు.
సంప్రదాయం, డిజిటల్ సౌకర్యం రెండూ ముందంజలోనే: ఒకవైపు నేరుగా రైతుల వద్ద పాలు కొంటూనే, మరోవైపు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మొబైల్ యాప్‌ల ద్వారా పాలు తెప్పించుకోవడంలోనూ భాగ్యనగర వాసులు ముందున్నారు. ఇతర నగరాల్లో యాప్‌ల ద్వారా పాలు కొనేవారి సగటు 22 శాతం ఉండగా, హైదరాబాద్‌లో ఏకంగా 34 శాతం మంది డిజిటల్ యాప్‌లను వినియోగిస్తున్నారని సర్వే తెలిపింది. సంప్రదాయ పద్ధతులు, ఆధునిక డిజిటల్ సౌకర్యాలు రెండూ హైదరాబాద్‌లో సమాంతరంగా వృద్ధి చెందుతున్నాయని గోద్రెజ్ జెర్సీ సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు.
టీ, కాఫీల రూపంలోనే అధిక వినియోగం: హైదరాబాద్‌లో 55 శాతం మంది రోజూ టీ లేదా కాఫీల రూపంలో పాలను తీసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రోటీన్ అందించే ఆహారంగా 61 శాతం మంది పాలను భావిస్తుండగా, అది ఒక సంపూర్ణ ప్రోటీన్ అని 55 శాతం మంది గుర్తించారు. అయితే, హై-ప్రోటీన్ పాల పట్ల అవగాహన ఇంకా పరిమితంగానే ఉంది. కేవలం 19 శాతం మంది మాత్రమే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటుండగా, 39 శాతం మంది దాని గురించి విన్నప్పటికీ ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. జాతీయ స్థాయిలో చూస్తే 60 శాతం మంది టీ, కాఫీల ద్వారా, 40 శాతం మంది నేరుగా పాలు తాగుతున్నారు. పెరుగన్నం, మజ్జిగ లేదా నిద్రపోయే ముందు పాలు తాగే చిన్ననాటి అలవాట్లను పదిమందిలో తొమ్మిది మంది నేటికీ కొనసాగిస్తుండటం విశేషం.