నగరంలో వీధి కుక్కల దాడి: బాలుడికి తీవ్ర గాయాలు

Published on: 12 May 2026, 03:33 AM
News Article

హైదరాబాద్, మే 12 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నగరంలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. వేసవి సెలవుల కోసం వచ్చిన ఓ చిన్నారిపై పది కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన వనస్థలిపురం పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. సిద్ధిపేట ప్రాంతానికి చెందిన అద్విక్ అనే బాలుడు సెలవుల కోసం టీచర్స్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా, ఒక్కసారిగా కుక్కల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి తలపై చర్మం ఊడిపోవడంతో పాటు శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి, చిన్నారిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నగరంలో కుక్కల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.