నల్లమల అడవిలో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ జీపు..

Published on: 23 Jun 2026, 12:52 PM
News Article

నాగర్‌కర్నూల్, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నల్లమల అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరిధిలోని హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ జీపు అదుపుతప్పి ఏకంగా 100 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. అమ్రాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు చిన్నపిల్లలతో కలిసి అచ్చంపేటకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికుల సాయంతో హుటాహుటిన అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మహిళలకు 'ఉచిత బస్సు' (ఫ్రీ బస్సు) పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా వేధిస్తోందని, సమయానికి బస్సులు లేకపోవడం వల్లే తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇలా పరిమితికి మించి ఎక్కించుకునే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడుతున్నామని గాయపడిన ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.