"నా కొడుకును చంపేసి.. ఫొటోకు దండేసుకోమన్నారు": వైఎస్‌ జగన్ ఎదుట సాయికృష్ణ తల్లి రోదన!

Published on: 19 Jun 2026, 04:21 AM
News Article
  • ఏడెనిమిది మంది కొట్టేంత తప్పు నా కొడుకు ఏం చేశాడంటూ కన్నీటి పర్యంతం
  • సాయికృష్ణను హింసించడం కళ్లారా చూశానన్న ప్రత్యక్ష సాక్షి మహంకాళి



అమరావతి, జూన్ 19 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పోలీసుల అమానుష దౌర్జన్యానికి బలైన సాయికృష్ణ అనే యువకుడి తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట తన కొడుకును కోల్పోయిన ఆవేదనతో కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏడెనిమిది మంది పోలీసులు కలిసి అంత దారుణంగా కొట్టేంత తప్పు తన కొడుకు ఏం చేశాడంటూ, స్టేషన్‌లో పోలీసులు కొడుతుంటే తన అబ్బాయి అరుపులు బయటకు వినిపించాయని ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకు గురించి తెలుసుకోవడానికి తాము ఎన్నిమార్లు స్టేషన్‌కు వెళ్లినా పోలీసులు సమాధానం చెప్పలేదని, ఆ తర్వాత ఓ రోజు 'నీ కొడుకును చంపేశాం.. ఫొటో చేయించుకుని దండేసుకో' అంటూ సదరు సీఐ అత్యంత హేళనగా మాట్లాడారని కన్నీటి పర్యంతమైంది. కనీసం తన బిడ్డ శవం లేకపోయినా.. బూడిదైనా ఇవ్వాలంటూ ఆమె వేడుకోగా, స్టేషన్‌లో సాయికృష్ణను పోలీసులు థర్డ్ డిగ్రీతో దారుణంగా హింసించడాన్ని తాను కళ్లారా చూశానని ప్రత్యక్ష సాక్షి మహంకాళి ఈ సందర్భంగా వెల్లడించడం తీవ్ర సంచలనం రేపింది.