నా బర్తరఫ్ చెల్లదు.. వివరణ తీసుకోకుండా చర్యలు ఎలా తీసుకుంటారు?: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పదవి తొలగింపు చెల్లదని, అసలు తన నుంచి ఎలాంటి వివరణ కూడా కోరకుండానే ఏకపక్షంగా ఎలా చర్యలు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇతర నేతల కుటుంబాల తీరును ఈ సందర్భంగా కొండా సురేఖ ఉదహరించారు. బీజేపీలో ఎంపీ అరవింద్ రాజకీయాల్లో ఉంటే.. కాంగ్రెస్‌లో ఆయన కుటుంబ సభ్యులు లేదా ఇతర నేతలు లేరా అని ప్రశ్నించారు. గత పదేళ్లుగా తన కూతురు రాజకీయాల్లో టికెట్ కోసం కష్టపడుతోందని, కడియం శ్రీహరి తన కూతురికి అవకాశం ఇచ్చుకోలేదా? అలాగే సుస్మిత కూడా టికెట్ అడిగితే తప్పేముంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణం, కుటుంబంపై జరుగుతున్న కక్షసాధింపు చర్యలపై ఆమె త్వరలోనే పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తామని తేల్చిచెప్పారు.