నారాయణపురం చేనేత సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల!
సంస్థాన్ నారాయణపురం, జూన్ 29 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆదేశాల ప్రకారం సంస్థాన్ నారాయణపురం చేనేత సహకార సంఘం లిమిటెడ్‌కు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి కె. ప్రవీణ్ కుమార్ సోమవారం అధికారికంగా విడుదల చేశారు. చేనేత సహకార సంఘం భవనంలో పర్సన్ ఇన్‌చార్జ్, మేనేజర్, మరియు సంఘం సభ్యుల సమక్షంలో ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే నెల (జూలై) 2, 3, 4 తేదీలలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 5న పరిశీలన, 6న ఉపసంహరణతో పాటు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుందని తెలిపారు. జూలై 10న ఉదయం నుండి పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఎన్నికల పూర్తి సమాచారాన్ని సంఘం నోటీస్ బోర్డుపై అందుబాటులో ఉంచామని, ఈ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరిన ఈ కార్యక్రమంలో సహకార సంఘం సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.