నిజామాబాద్‌లో 'చీతా ఫోర్స్' మెరుపు దాడి..
హైదరాబాద్ న్యూస్‌టైమ్, నిజామాబాద్ - మే 24, 2026: నిజామాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో 'చీతా ఫోర్స్' సిబ్బంది నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు; ఈ క్రమంలో 4టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్, తెలంగాణ పార్క్ పక్కన గల ఒక ఇంట్లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి నిర్వహించారు. ఈ ఆకస్మిక దాడిలో అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని ధృవీకరించుకున్న చీతా ఫోర్స్ సిబ్బంది.. ఘటనా స్థలం నుండి 3 మంది విటులను, 5 మంది విటురాళ్లను అదుపులోకి తీసుకున్నారు; వీరి వద్ద నుండి మొత్తం 7 మొబైల్ ఫోన్లు, రూ. 4,870 నగదును స్వాధీనం చేసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం 4టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) గారికి అప్పగించారు. పట్టణ పరిధిలో వ్యభిచార కేంద్రాలు, మత్తు పదార్థాల రవాణా, జూదం వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీస్ అధికారులు, ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని, ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ శాంతిభద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.