నిరుపేదల గొంతుక కామ్రేడ్ పోరెడ్డి సత్తిరెడ్డికి ఘన నివాళి
గట్టుప్పల, హైదరాబాద్ న్యూస్ టైమ్: సిపిఎం సీనియర్ నాయకులు, ప్రజా పోరాట యోధుడు కామ్రేడ్ పోరెడ్డి సత్తిరెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమం గట్టుప్పల మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. సిపిఎం టౌన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సత్తిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నిరుపేదల గొంతుక.. ధైర్యానికి మారుపేరు
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, సత్తిరెడ్డి చిన్నతనం నుండే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పెరిగారని గుర్తుచేసుకున్నారు. ఎర్రజెండా నీడలో నిరుపేదలకు న్యాయం జరగాలని ఆయన అనేక పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు.
రజాకార్ల చిత్రహింసలకు ఎదురొడ్డి..
రజాకార్ల కాలంలో పార్టీ రహస్యాలను వెల్లడించాలని సత్తిరెడ్డిని వారు తీవ్ర చిత్రహింసలకు గురిచేసినప్పటికీ, ప్రాణాలకు తెగించి పార్టీ నాయకులను, రహస్యాలను కాపాడిన గొప్ప ధైర్యశాలి అని నాయకులు ఉద్ఘాటించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎండి రబ్బాని, టౌన్ కార్యదర్శులు కర్నాటి సుధాకర్, పెద్దగాని నరసింహ, కర్నాటి వెంకటేశం, నాయకులు ఖమ్మం రాములు, ముసుకు బుచ్చిరెడ్డి, గుమ్మికొండ యాదిరెడ్డి, నల్లవెల్లి బిక్షం, పసుపుల చెన్నయ్య, బొబ్బల చంద్రయ్య, దుబ్బాక శంకరయ్య, కర్నాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.