నిర్మల్, అక్టోబర్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నిర్మల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కడెం మండలం ధర్మాజీపేట్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్ నుండి స్వగ్రామం కడెం మండలం న్యూ ధర్మాజీపేట్‌కు ఆటోలో ప్రయాణిస్తున్న పుదారి నడిపి భీమయ్య (55) అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.