నిర్మల్, అక్టోబర్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ అవకాశాన్ని నిర్మల్ జిల్లాకు చెందిన ఉద్యోగార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయమని, అటువంటిది జిల్లా కేంద్రంలోనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతులతో శిక్షణ అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాలంలో పోటీ విపరీతంగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచించిన ఆయన, దూర ప్రాంతాల విద్యార్థులకు వసతి కల్పనలో తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడాలి: ఎస్పీ జానకి షర్మిల జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా ప్రతి అభ్యర్థి అంకితభావంతో కష్టపడి చదువుకోవాలని సూచించారు. ఈ ఉచిత శిక్షణ కోసం సుమారు 300 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఒక పూట ఉచిత భోజనం, అల్పాహారంతో పాటు స్టడీ మెటీరియల్ సమకూరుస్తామన్నారు. సుదూర ప్రాంత విద్యార్థులకు వసతి ఏర్పాట్లతో పాటు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు పోలీసు సిబ్బంది చేత నాణ్యమైన బోధన అందిస్తామని చెప్పారు. అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసేందుకు ప్రతి రెండ్రోజులకోసారి పరీక్షలు నిర్వహిస్తామని, రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య (ఫిజికల్ ఈవెంట్స్) పరీక్షలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని భరోసానిచ్చారు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలుంటే సిబ్బందికి తెలపాలని సూచించారు.