నీట్-2026 పరీక్ష రద్దు..
- కోచింగ్ సెంటర్ ప్రాక్టీస్ పేపర్‌లో..
- 600 మార్కుల ప్రశ్నలు.. రంగంలోకి సీబీఐ!
(హైదరాబాద్ న్యూస్‌టైమ్ - నేషనల్ డెస్క్): దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET-2026) పరీక్ష రద్దయింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్షలో భారీ అక్రమాలు జరిగినట్లు తేలడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమిక విచారణలో తేలింది.
48 గంటల ముందే లీక్..: రాజస్థాన్‌లోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పరీక్షకు 48 గంటల ముందే విద్యార్థులకు ఒక ప్రాక్టీస్ పేపర్‌ను ఇచ్చారు. అందులోని ప్రశ్నల్లో సుమారు 600 మార్కుల విలువైన ప్రశ్నలు ఒరిజినల్ నీట్ పేపర్‌లో ఉండటం గమనార్హం. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న మూలాలను వెలికితీసేందుకు సీబీఐ (CBI) విచారణకు ఆదేశించింది.
విద్యార్థులకు ఊరట..: పరీక్ష రద్దుతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఎన్టీఏ ఊరటనిచ్చింది. తదుపరి పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే పరీక్ష తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, కేవలం ప్రతిభావంతులకే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని NTA హామీ ఇచ్చింది.